మంత్రి సురేష్‌ను కలిసిన ఎస్పీ

రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్‌ పుష్పగుచ్ఛం అందిస్తున్న ఎస్పీ పరమేశ్వర రెడ్డి  - Sakshi

ఒంగోలు సబర్బన్‌: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఎస్పీ సంతపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాత్రి బాధ్యతలు తీసుకున్న తరువాత మొదటి సారిగా కలిశారు. ఎస్పీ పూల మొక్కను అందించి మంత్రి సురేష్‌ను అభినందించారు. ఇరువురు కొంతసేపు జిల్లాలోని పరిస్థితులపై సమీక్షించుకున్నారు. కొండపి అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయ, సామాజిక పరిస్థితులపై ఇరువురు లోతుగా చర్చించుకున్నట్లు సమాచారం.

గుర్తు తెలియని వ్యక్తి మృతి

సింగరాయకొండ (మర్రిపూడి): సింగరాయకొండ రైల్వేస్టేషన్‌ లోని ఒకటో నంబరు ఫ్లాట్‌ఫాంపై శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి (40) మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఇతని కుడి కన్ను పై భాగంలో రక్త గాయాలయ్యాయి. ఇతను వంకాయ కలర్‌ నిండు చేతుల చొక్కా, కాఫీ కలర్‌ ప్యాంటు ధరించి ఉన్నాడు. పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఇతని ఆచూకీ తెలిసిన వారు 9440904870, 7013915467 నంబర్లకు సమాచారం అందించాలని వివరించారు.

చెక్‌డ్యాంలో పడి వృద్ధుడు మృతి

పామూరు: ప్రమాద వశాత్తు చెక్‌ డ్యాంలో పడిపోయి వృద్ధుడు మృతి చెందిన ఘటన శుక్రవారం మండలంలోని పాబోలువారిపల్లె సమీపంలోని దాసరివాగు చెక్‌ డ్యాంలో చోటు చేసుకుంది. ఎస్సై తెలిపిన వివరాలు.. పాబోలువారిపల్లె గ్రామానికి చెందిన వడ్డెపల్లి మాలకొండయ్య సమీపంలోని సుబాబుల్‌ తోటకు కాపలాగా వెళ్తుంటాడు. కాగా శుక్రవారం మాలకొండయ్యకు ఆరోగ్యం సరిలేకపోగా మార్గమధ్యంలో దాసరి వాగు చెక్‌డ్యామ్‌ వద్దకు బహిర్బూమికి వెళ్లాడు. ఈసందర్భంగా ప్రమాదవశాత్తు మాలకొండయ్య (83) చెక్‌డ్యామ్‌ నీటిలో పడి మృతిచెందాడు. కొంత సమయం తరువాత గమనించినవారు.. కుటుంబ సభ్యులకు తెలపగా అక్కడికి వెళ్లి చూసేసరికి మృతి చెందిన ఉన్నాడు. నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు నరసింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి వైద్యశాలకు తరలిస్తున్నట్లు ఎస్సై సైదుబాబు తెలిపారు. కాగా అప్పటివరకు తమతో ఉన్న తండ్రి మృతి చెందడంతో మృతుని కుటుంబంలో విషాదం నెలకొంది.

whatsapp channel

Read latest Prakasam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top