ఆరణి శ్రీనివాసులుకు వైసీపీ అధిష్టానం షాక్ ట్రీట్‌మెంట్‌

చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులును రాజ్యసభకు పంపుతామని ముందుగా లీకులిచ్చింది. మంత్రి పెద్దిరెడ్డితో మాట్లాడించడంతో ఎమ్మెల్యే కూడా తాను రాజ్యసభ సభ్యుడిని అయిపోతున్నట్లు సంబరం చేసుకున్నారు.

ఆరణి శ్రీనివాసులుకు వైసీపీ అధిష్టానం షాక్ ట్రీట్‌మెంట్‌

Chittoor MLA Arani Srinivasulu shocked by YSRCP highcommand

Arani Srinivasulu: రాయలసీమలో ఆ ఎమ్మెల్యేను చూస్తే ఎవరికైనా జాలేస్తుంది.. అయ్యో పాపం అన్నవారే ఎక్కువగా కనిపిస్తున్నారు.. ఉన్న సీటు ఊడగొట్టిన అధిష్టానం.. ఇచ్చిన హామీని గాలికి వదిలేయడంతో అగమ్యగోచరంగా తయారైంది ఆ ఎమ్మెల్యే పరిస్థితి. వైసీపీ అధిష్టానం ఇచ్చిన షాక్ ట్రీట్‌మెంట్‌తో కీలక ఎన్నికల సమయంలో ఆ ఎమ్మెల్యే వైఖరి ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.

మార్పు చేర్పులతో ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తున్న వైసీపీ అధిష్టానం.. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు మాత్రం డబుల్ షాక్‌ ఇచ్చింది వైసీపీ.. గత ఎన్నికల్లో తొలిసారి గెలిచిన ఆరణి శ్రీనివాసులు.. మళ్లీ ఎన్నికల్లో సీటు ఖాయం అనుకున్నారు. రాయలసీమలో ఏకైక బలిజ ఎమ్మెల్యే కావడంతో తన సీటు సేఫ్ అని భావించారు. అయితే ఆయనను నైస్‌గా తప్పించింది వైసీపీ అధిష్టానం.. సీమలో బలిజలు ఎక్కువగా ఉండటం.. పైగా శ్రీనివాసులు ఒక్కరే ప్రాతినిధ్యం వహించడంతో ఆయనను పక్కకు తప్పించేందుకు చాలా జాగ్రత్తగా.. ఎక్కడా అసంతృప్తి లేకుండా పావులు కదిపింది హైకమాండ్.

ఎమ్మెల్యే సీటును హ్యాపీగా త్యాగం చేసినా..
చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులును రాజ్యసభకు పంపుతామని ముందుగా లీకులిచ్చింది. మంత్రి పెద్దిరెడ్డితో మాట్లాడించడంతో ఎమ్మెల్యే కూడా తాను రాజ్యసభ సభ్యుడిని అయిపోతున్నట్లు సంబరం చేసుకున్నారు. తన ఎమ్మెల్యే సీటును హ్యాపీగా త్యాగం చేశారు. ఇక రాజ్యసభ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నామినేషన్ వేయడం.. ఎంపీగా విజయం సాధించడం ఒక్కటే బ్యాలెన్స్ అన్నట్లు చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే.. ఇలా సంబరాలు చేసుకుంటున్న ఎమ్మెల్యేకు ఆ ఆనందం ఎన్నాళ్లు లేకుండా చేసింది హైకమాండ్. సామాజిక వర్గ కూర్పులు, చేర్పుల సాకుతో శ్రీనివాసులును రాజ్యసభ రేసు నుంచి తప్పించి.. ఆయన స్థానంలో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సోదరుడు రఘురామిరెడ్డిని ఎంపిక చేసింది.

భవిష్యత్ ఆగమ్యగోచరం
అధిష్టానం తాజా నిర్ణయంతో షాక్‌తిన్న ఎమ్మెల్యే శ్రీనివాసులు భవిష్యత్ ఆగమ్యగోచరంగా తయారైంది. 2009 నుంచి ఎమ్మెల్యే కావాలని కలలు కంటున్న శ్రీనివాసులు కోరిక 2019లో నెరవేరింది. మరోసారి చాన్స్ వస్తుందని ఆశపడుతున్న సమయంలో ఆశలు అడియాసలు అయ్యాయి. వాస్తవానికి చాలా రోజుల నుంచి ఎమ్మెల్యే శ్రీనివాసులు సీటుకు ఎసరు వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడైన విజయానందరెడ్డి చిత్తూరు సీటుపై కన్నేయడంతో శ్రీనివాసులుకు కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికల సమయానికి ఇవి ఎక్కువ కావడంతో టికెట్ వస్తుందో? రాదో? అన్న డౌట్ పెరిగిపోయింది. కానీ, సీమలో బలిజల జనాభాను దృష్టిలో పెట్టుకుని శ్రీనివాసులును తప్పిస్తారని ఎవరూ అనుకోలేదు. ఇదే కారణంతో శ్రీనివాసులు కూడా చాలా ధీమాగా ఉండేవారు. కానీ, అధిష్టానం చాలా వ్యూహాత్మకంగా పావులు కదిపింది. శ్రీనివాసులును తప్పించినా.. బలిజలను దూరం చేసుకోకూడదనే వ్యూహంలో భాగంగా ముందుగా శ్రీనివాసులుకు రాజ్యసభ ఎంపీ పదవిని ఆఫర్ చేసింది. ఏమైందో ఏమోగాని.. రోజుల వ్యవధిలోనే వైసీపీ అధిష్టానం వ్యూహం మార్చేయడంతో శ్రీనివాసులకు ఝలక్ తగిలింది.

Also Read: కృష్ణా జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ.. అభ్యర్థులు వీళ్లే?

బలిజ నేతల అసంతృప్తి 
ఇలా రాజ్యసభ రేసు నుంచి తప్పించిన ఎమ్మెల్యేకు.. రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో అవకాశం ఇస్తామని ఊరడిస్తున్నారు పార్టీ పెద్దలు.. కీలకమైన సమయంలో తప్పించి.. ఎప్పుడో రెండేళ్ల తర్వాత ఇస్తామంటే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు రాయలసీమలోని బలిజ నేతలు కూడా వైసీపీ తీరుపై అసంతృప్తి చెందుతున్నట్లు చెబుతున్నారు. తమ వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యేను తప్పించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కీలక ఎన్నికల సమయంలో ఒక వర్గాన్ని దూరం చూసుకునేలా వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలకులు తప్పుబడుతున్నారు. దీని పర్యావసనాలు ఎలా ఉంటాయన్న విషయంపై పరిశీలన జరిపే ఈ నిర్ణయం తీసుకున్నారా? లేదా? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి చిత్తూరు ఎమ్మెల్యే ఎపిసోడ్‌ రాయలసీమలో రాజకీయ దుమారం రేపుతోంది. ఇక ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.