భారీగా దిగొస్తున్నాయి.. చికెన్​ కిలో రూ.160

భారీగా దిగొస్తున్నాయి.. చికెన్​ కిలో రూ.160
  •      నెల క్రితం రూ.260.. 
  •     రెండు వారాలుగా తగ్గుముఖం 
  •     కోళ్ల ఉత్పత్తి పెరగడమే 
  •     కారణమంటున్న వ్యాపారులు


హైదరాబాద్, వెలుగు: చికెన్ రేట్లు భారీగా దిగొస్తున్నాయి. నెల కింద రూ.260 ఉన్న చికెన్​ తగ్గుతూ వస్తోంది. రెండు వారాల కింద రూ.230కి చేరింది. ఆదివారం నాటికి కిలో రూ.160కి పడిపోయింది. దీంతో కొనుగోళ్లు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. సాధారణంగా వేసవిలో ఎండలకు కోళ్లు మృతి చెంది చికెన్​ కొరత ఏర్పడుతుంది. దీంతో ధరలు పెరుగుతాయి. చలికాలంలో ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో ధరలు కాస్త తక్కువగానే ఉంటాయి. 

గత నెలలో కార్తీక మాసం కావడంతో కొందరు చికెన్​మానేశారు. నిజానికి ఆ టైమ్​లో తగ్గాలి. కానీ రేటు స్థిరంగా కొనసాగింది. కార్తీక మాసం తర్వాత చికెన్​ రేట్లు పెరుగుతాయని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా తగ్గాయి. కార్తీక మాసం టైమ్​లో డిమాండ్​కు అనుగుణంగా కోళ్లఫామ్ ​రైతులు పెంపకం చేపట్టడం వల్ల పెద్దగా రేట్లు తగ్గలేదని, ఆ తర్వాత డిమాండ్​కు మించి ఉత్పత్తిని భారీగా పెంచడంతో కొనుగోళ్లు పెరిగినా రేట్లు దిగొచ్చాయని అంటున్నారు. ప్రస్తుతం హోల్​సేల్​ మార్కెట్​లో కిలో చికెన్​రూ.120కి అమ్ముతున్నట్టు వ్యాపారులు తెలిపారు. గ్రేటర్ ​హైదరాబాద్​ పరిధిలో రోజూ 3.5 లక్షల కేజీల చికెన్​ వినియోగం అవుతుండగా, ఇటీవల డిసెంబరు 31న 4.5 లక్షల కేజీల చికెన్​ అమ్మకాలు జరిగినట్టు చెప్పారు.