పాత కక్షలతోనే హత్య

నిందితులను అరెస్టు చూపుతున్న   డీఎస్పీ గంగయ్య, ట్రైనీ డీఎస్పీ హేమంత్‌    - Sakshi

సయ్యద్‌ ఆరీఫ్‌ ఖాద్రీ హత్య కేసు ఛేదించిన పోలీసులు

9 మంది అరెస్టు

తాడిపత్రి అర్బన్‌: పట్టణంలో సంచలనం సృష్టించిన సయ్యద్‌ ఆరీఫ్‌ ఖాద్రీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య చేసినట్లు ప్రాథమికంగా తేల్చారు. 9 మంది నిందితులను అరెస్టు చేశారు. డీఎస్పీ గంగయ్య, ట్రైనీ డీఎస్పీ హేమంత్‌కుమార్‌, ఇన్‌చార్జ్‌ సీఐ శంకర్‌రెడ్డితో కలిసి శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ నెల 3న సాయంత్రం పట్టణంలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో సయ్యద్‌ ఆరీఫ్‌ ఖాద్రీ హత్యకు గురయ్యాడన్నారు. మృతుడి తల్లి సయ్యద్‌ ఫకురున్నీసా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఇన్‌చార్జ్‌ సీఐ శంకర్‌రెడ్డి, అర్బన్‌ ఎస్‌ఐ రామకృష్ణ రెండు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సీఐ శంకర్‌రెడ్డికి ముందస్తుగా అందిన సమాచరం మేరకు శనివారం ఉదయం 9 గంటల సమయంలో స్థానిక శివాలయం సమీపంలో నిందితులు బద్వేల్‌ రహంతుల్లా, మహ్మద్‌ అయూఫ్‌, షేక్‌ సాధిక్‌వలి, బద్వేల్‌ షబ్బీర్‌, తోళ్ల మాబు, షేక్‌ కలాం బాషా, నన్నేబచ్చే పటాన్‌ హాజీబాషా, దూదేకుల మహ్మద్‌, షేక్‌ చిన్న హాజీబాషాను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారి నుంచి 4 వేట కొడవళ్లు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశామన్నారు. హత్య కేసులో చిక్కేపల్లి ఖాదర్‌బాషా పాత్రపై విచారిస్తున్నామని, మరో ముగ్గురు ముద్దాయిలు పరారీలో ఉన్నట్లు చెప్పారు.

కక్ష గట్టి చంపేశారు..

నిందితుల్లో ఒకరైన బద్వేల్‌ రహంతుల్లా, హతుడు సయ్యద్‌ ఆరీఫ్‌ల మధ్య ఘర్షణలు ఉండేవని డీఎస్పీ తెలిపారు. దీంతో సయ్యద్‌ ఆరీఫ్‌, అతని స్నేహితులు కలిసి 2022 ఆగస్టులో ఆసుపత్రి పాలెంలో ఇంటి బయట నిద్రిస్తున్న బద్వేల్‌ రహంతుల్లా నానమ్మ, మేనత్తపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్య చేశారన్నారు. అప్పటి నుంచి బద్వేల్‌ రహంతుల్లా అయూఫ్‌, తౌపిక్‌లు తన నానమ్మ, మేనత్తను చంపిన వారిపై కక్ష పెంచుకున్నారన్నారు. ఈనెల 3న సయ్యద్‌ ఆరీఫ్‌ ఖాద్రీ మెయిన్‌ బజార్‌లోని బాలికల ఉన్నత పాఠశాల వద్ద ఉన్నాడన్న సమాచారం అందుకున్న నిందితులు అక్కడికి చేరుకుని ఆరీఫ్‌ను చుట్టుముట్టి ఒక్కసారిగా వేటకొడవళ్లతో విచక్షణారహితంగా నరికి పారిపోయారన్నారు. హత్యకేసు నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఎస్పీ అన్బురాజన్‌, డీఎస్పీ గంగయ్య, ట్రైనీ డీఎస్పీ హేమత్‌కుమార్‌లు అభినందించారు.

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top