కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌పై సెబీ వేటు

ABN , First Publish Date - 2023-04-29T02:14:38+05:30 IST

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ (కేఎ్‌సబీఎల్‌)పై మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ కొరడా ఝళిపించింది.

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌పై సెబీ వేటు

ప్రమోటర్‌ పార్థసారథిపై కూడా

ఏడేళ్ల పాటు మార్కెట్‌ నుంచి నిషేధం.. రూ.21 కోట్ల భారీ జరిమానా

మళ్లించిన నిధులూ జమ చేయాలి

ఎన్‌ఎస్‌ఈకి ఆస్తుల స్వాధీన హక్కు

న్యూఢిల్లీ: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ (కేఎ్‌సబీఎల్‌)పై మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ కొరడా ఝళిపించింది. ఆ సంస్థతో పాటు ఆ సంస్థ ప్రధాన ప్రమోటర్‌ సీ పార్థసారథి ఏడేళ్ల పాటు సెక్యూరిటీస్‌ మార్కెట్లో ఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండా నిషేధించింది. దీనికి తోడు రూ.21 కోట్ల భారీ జరిమానా విధించింది. ఇందులో రూ.13 కోట్లు కేఎ్‌సబీఎల్‌, రూ.8 కోట్లు కంపెనీ ప్రమోటర్‌, ఎండీ పార్థసారథి చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది.

ఎందుకంటే?

ఖాతాదారుల నుంచి తీసుకున్న పవర్‌ ఆఫ్‌ అటార్నీ (పీఓఏ)ని అడ్డుపెట్టుకుని కేఎ్‌సబీఎల్‌.. వారి నిధులను దుర్వినియోగం చేసినందుకు సెబీ ఈ చర్యలు తీసుకుంది. పీఓఏల ద్వారా ఖాతాదారుల షేర్లను కుదువపెట్టి తీసుకున్న రూ.1,442.95 కోట్ల రుణాలను కేఎ్‌సబీఎల్‌ తన గ్రూప్‌ కంపెనీలైన కార్వీ రియల్టీ (ఇండియా) లిమిటెడ్‌, కార్వీ క్యాపిటల్‌ లిమిటెడ్‌ (కేసీఎల్‌) కంపెనీలకు అక్రమంగా దారి మళ్లించిందని సెబీ తన తుది ఆదేశాల్లో తెలిపింది. ఈ రెండు కంపెనీలు ఈ మొత్తాన్ని మూడు నెలల్లో కేఎ్‌సబీఎల్‌కు బదిలీ చేయాలని కోరింది. లేకపోతే ఎన్‌ఎ్‌సఈ ఈ రెండు సంస్థల ఆస్తులు స్వాధీనం చేసుకుని ఆ నిధులు వసూలు చేసేందుకు అనుమతించింది.

డైరెక్టర్లపైనా వేటు

దేశ సెక్యూరిటీస్‌ మార్కెట్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో సెబీ మరిన్ని కఠిన చర్యలు తీసుకుంది. కంపెనీ ప్రధాన ప్రమోటర్‌ పదేళ్ల పాటు ఏ లిస్టెడ్‌ కంపెనీ లేదా వాటి అనుబంధ సంస్థల బోర్డుల్లో గానీ, మేనేజ్‌మెంట్‌ స్థాయిలో గానీ ఎలాంటి పదవులు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. కేఎ్‌సబీఎల్‌ అప్పటి డైరెక్టర్లు భగవాన్‌ దాస్‌ నారంగ్‌, జ్యోతి ప్రసాద్‌లపైనా రెండేళ్ల పాటు ఎలాంటి పదవులు చేపట్టకుండా నిషేధించింది. అంతేకాకుండావారిద్దరిపైనా చెరో రూ.5 లక్షల చొప్పున జరిమానా విధించింది. సెబీ తాజా ఆదేశాలతో భారత సెక్యూరిటీస్‌ మార్కెట్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కార్వీ గ్రూప్‌ చరిత్ర ఇక కనుమరుగైట్టేనని భావిస్తున్నారు.

Updated Date - 2023-04-29T02:14:54+05:30 IST