భారత్‌కు బలమైన ఎక్స్ఛేంజీలు అవసరం

ABN , First Publish Date - 2023-04-24T01:15:21+05:30 IST

భారత్‌కు ఒకటి కన్నా ఎక్కువ శక్తివంతమైన ఎక్స్ఛేంజీలు అవసరమని బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ (బీఎ్‌సఈ) ఎండీ సీఈఓ సుందరరామన్‌ రామమూర్తి అన్నారు.

భారత్‌కు బలమైన ఎక్స్ఛేంజీలు అవసరం

బీఎ్‌సఈ పునరుజ్జీవానికి చర్యలు

సంస్థ ఎండీ, సీఈఓ సుందరరామన్‌ రామమూర్తి

కోల్‌కతా: భారత్‌కు ఒకటి కన్నా ఎక్కువ శక్తివంతమైన ఎక్స్ఛేంజీలు అవసరమని బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ (బీఎ్‌సఈ) ఎండీ సీఈఓ సుందరరామన్‌ రామమూర్తి అన్నారు. ఇన్వెస్టర్లకు మరింత సౌకర్యం కలిగించి ఎక్స్ఛేంజీని పునరుజ్జీవింపచేయడానికి బీఎ్‌సఈ తన క్యాపిటల్‌ ఉత్పత్తుల్లో అవసరమైన మార్పులు చేస్తున్నదని ఆయన చెప్పారు. బీఎ్‌సఈలో అందరూ క్రియాశీలంగా పాల్గొనేలా చేసేందుకు టెక్నాలజీ ప్రొవైడర్లు, బ్రోకర్లు, తుది వినియోగదారులను ప్రోత్సహించడం తమ లక్ష్యమని ఆయన అన్నారు. జనవరిలో బీఎస్‌ఈ పగ్గాలు స్వీకరించిన రామమూర్తి ఎక్స్ఛేంజీ పునరుజ్జీవానికి పలు చర్యలు తీసుకుంటున్నారు. ‘‘మేం మే నెల 15వ తేదీ నుంచి తక్కువ లాట్‌ సైజులో, తక్కువ గడువు చెల్లుబాటు కాలపరిమితితో సెన్సెక్స్‌, బ్యాంకెక్స్‌ డెరివేటివ్స్‌ను తిరిగి ప్రవేశపెతున్నాం. ఇలా చేయడం వల్ల అధిక శాతం మంది ట్రాక్‌ చేసే ప్రసిద్ధి చెందిన ఈ సూచీల్లో ట్రేడ్‌ చేసుకునే అవకాశం ఇన్వెస్టర్లకు లభిస్తుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాలో ఉన్నట్లుగానే వారాంతపు గడువు చెల్లింపు వ్యవధితో వీక్లీ ఆప్షన్లు తిరిగి ప్రవేశపెట్టేందుకు నియంత్రణ సంస్థలకు కూడా దరఖాస్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. దీంతో పాటుగా తామే అగ్రగామిగా ఉన్న స్టార్‌ ఎంఎఫ్‌, ఇండియా ఐఎన్‌ఎక్స్‌, ఎస్‌ఎంఈ వేదికలను కూడా బలోపేతం చేస్తున్నామన్నారు.

బీఎ్‌సఈ స్టార్‌ ఎంఎఫ్‌ దేశంలోనే అతి పెద్ద మ్యూచువల్‌ ఫండ్‌ పంపిణీ వేదిక. ఫ్యూచర్స్‌, ఆప్షన్ల లాట్‌సైజుని సెన్సెక్స్‌లో 15 నుంచి 10కి, బ్యాంకెక్స్‌లో 20 నుంచి 15కి తగ్గిస్తున్నట్టు ఆయన తెలిపారు. పరిణతి చెందుతున్న కస్టమర్‌ అవసరాలకు అనుగుణంగా తక్కువ ధరలో, ఇన్నోవేటివ్‌ సొల్యూషన్లు తాము అందిస్తున్నట్టు రామమూర్తి చెప్పారు. కాగా ఈక్విటీ ఫ్యూచర్స్‌కు లావాదేవీల ఫీజును తాము పెంచాలనుకోవడంలేదని కూడా ఆయన స్పష్ఠం చేశారు. మార్చిలోనే బీఎ్‌సఈ కరెన్సీ ఆప్షన్లలో స్ర్టైక్‌ ఇంటర్వల్‌ను 25 పైసల నుంచి 10 పైసలకు తగ్గించింది. నగదు ఈక్విటీల విభాగంలో రూ.100 కన్నా తక్కువ ధరలోని స్టాక్స్‌కు ఒక పైసా టిక్‌ సైజును ప్రవేశపెట్టింది.

Updated Date - 2023-04-24T01:15:21+05:30 IST