బీఓఐ లాభం రూ.1,350 కోట్లు

ABN , First Publish Date - 2023-05-07T03:18:34+05:30 IST

మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) నికర లాభం రెండింతలకు పైగా పెరిగి రూ.1,350 కోట్లుగా నమోదైంది...

బీఓఐ లాభం రూ.1,350 కోట్లు

ఒక్కో షేరుకు రూ.2 డివిడెండ్‌

ముంబై: మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) నికర లాభం రెండింతలకు పైగా పెరిగి రూ.1,350 కోట్లుగా నమోదైంది. ఈ కాలానికి బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 37.77 శాతం వృద్ధితో రూ.5,493 కోట్లకు పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. నికర వడ్డీ మార్జిన్‌ సైతం 3.15 శాతానికి మెరుగుపడింది. గత ఆర్థిక సంవత్సరం (2022-23) మొత్తానికి బ్యాంక్‌ నికర లాభం 18.15 శాతం పెరిగి రూ.4,023 కోట్లకు చేరుకుంది. 2022-23కు గాను వాటాదారులకు ఒక్కోషేరుకు రూ.2 డివిడెండ్‌ చెల్లించనున్నట్లు బీఓఐ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ రుణాలు 12.87 శాతం వృద్ధి చెంది రూ.5.15 లక్షల కోట్లకు, డిపాజిట్లు 6.64 శాతం పెరుగుదలతో రూ.6.69 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 2022 మార్చి 31 నాటికి 9.98 శాతంగా నమోదైన బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు (గ్రాస్‌ ఎన్‌పీఏ).. ఈ మార్చి చివరికల్లా 7.31 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు సైతం 2.34 శాతం నుంచి 1.66 శాతానికి జారుకున్నాయి.

Updated Date - 2023-05-07T03:18:34+05:30 IST