జిల్లాలో 80.77 శాతంపింఛన్ల పంపిణీ

- - Sakshi

చిలకలపూడి(మచిలీపట్నం): వైఎస్సార్‌ పింఛను కానుక పథకం కింద జిల్లాలో శుక్రవారం లబ్ధిదారులకు పింఛన్ల నగదు పంపిణీ కార్యక్రమం కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 2,45,783 మందికి పింఛన్లు అందజేయాల్సి ఉండగా 1,98,511 మందికి అందజేశారు. ఇప్పటి వరకూ 80.77 శాతం పంపిణీ చేశారు. శుక్రవారం కూడా కృష్ణాజిల్లా రాష్ట్రంలో పింఛన్ల పంపిణీలో ప్రథమస్థానంలో నిలిచింది. మచిలీపట్నం, చల్లపల్లి మండలాలతో పాటు గుడివాడ పట్టణం పింఛన్ల పంపిణీలో మొదటి మూడుస్థానాలు సాధించినట్లు డీఆర్డీఏ పీడీ పీఎస్‌ఆర్‌ ప్రసాద్‌ తెలిపారు.

ప్రగతి పథాన కేడీసీసీబీ

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని

గుడ్లవల్లేరు(గుడివాడ): కేడీసీసీ బ్యాంకు రైతులకే గాక సమాజంలోని ఇతర అవసరాలకు రుణాలను అందిస్తూ రూ.11వేల కోట్లు టర్నోవర్‌తో అభివృద్ధి పథంలో నడుస్తోందని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) అన్నారు. శుక్రవారం రూ.99లక్షల నిధులతో నిర్మించిన గుడ్లవల్లేరు కేడీసీసీబీ బ్రాంచి భవన నిర్మాణాన్ని ఆయనతో పాటు జెడ్పీ చైర్‌ పర్సన్‌ ఉప్పాల హారిక, కేడీసీసీబీ చైర్‌ పర్సన్‌ తాతినేని పద్మావతి చేతుల మీదుగా ప్రారంభించారు. రైతులకే గాక ఆయా కుటుంబాల్లో పిల్లల విదేశీ విద్యకు రుణాలను అందించేందుకు తమ బ్యాంకు ఉపయోగపడుతుందని తాతినేని పద్మావతి తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి ఉప్పాల రాము, పార్టీ రాష్ట్ర నాయకుడు దుక్కిపాటి శశిభూషణ్‌, ఎన్టీఆర్‌ స్టేడియం వైస్‌ చైర్మన్‌ పాలేటి చంటి, కేడీసీసీబీ డైరెక్టర్‌ పడమటి సుజాత, ఎంపీపీ కొడాలి సురేష్‌, పీఏసీఎస్‌ అధ్యక్షులు దుగ్గిరాల శేషుబాబు తదితరులు పాల్గొన్నారు.

కృష్ణా జేసీగా గీతాంజలి శర్మ బాధ్యతల స్వీకరణ

చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జాయింట్‌ కలెక్టర్‌గా గీతాంజలి శర్మ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత వేదపండితుల మంత్రోచ్చరణలతో ఆశీర్వాదాలు స్వీకరించిన అనంతరం ఆమె బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం జేసీ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు. రాష్ట్రంలోనే కృష్ణాజిల్లాను ప్రగతి పథంలో నడిపే విధంగా తనవంతు కృషి చేస్తానన్నారు. కృష్ణాజిల్లాకు ఎంతో చారిత్రాత్మకమైన గుర్తింపు ఉందని క్షేత్రస్థాయిలో పర్యటించి మరింత తెలుసుకుంటానన్నారు. అనంతరం కలెక్టర్‌ పి. రాజాబాబును మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. కార్యక్రమంలో పూర్వ జాయింట్‌ కలెక్టర్‌ అపరాజితాసింగ్‌, డీఆర్వో పెద్ది రోజా, కలెక్టరేట్‌ ఏవో ఏఎస్‌ఎన్‌ రాధిక పాల్గొన్నారు.

దుర్గమ్మకు కానుకగావెండి త్రిశూలం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన భక్తులు శుక్రవారం వెండి త్రిశూలాన్ని కానుకగా సమర్పించారు. సోంపేటకు చెందిన ములగాడ విజయలక్ష్మి, చిట్టబ్బాయిల పేరిట కుటుంబ సభ్యులు కేజీ వెండితో తయారు చేయించిన త్రిశూలాన్ని ఆలయ ఈవో కేఎస్‌.రామారావుకు అందజేశారు. సినీ నటి పడాల కల్యాణి (కరాటే కల్యాణి) దాతలతో పాటు ఉన్నారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం తర్వాత అమ్మవారి ప్రసాదాలను అందించారు.

Read latest Krishna News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top