అర్హులైతే పథకం అందాల్సిందే

- - Sakshi

చిలకలపూడి(మచిలీపట్నం): అర్హులైన పేద లబ్ధిదారులందరికీ మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కృష్ణా జిల్లా కలెక్టర్‌ పి. రాజాబాబు అన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి వీక్షించిన అనంతరం కలెక్టర్‌ రాజాబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం నవరత్నాలు పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఎవరైనా అర్హులై ఉండి సరైన పత్రాలు సమర్పించకుండా పథకాలు అందకపోతే అటువంటి వారు ఏటా ఆరు నెలలకు ఒకసారి జూన్‌, డిసెంబర్‌ నెలల్లో దీనికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ దరఖాస్తుల పరిశీలన జరిపి మంజూరు చేస్తున్నారు. అర్హత కలిగి ఉండి ఏ ఒక్కరు ప్రభుత్వ పథకం లబ్ధి పొందకుండా మిగిలి ఉండకూడదనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. దీని ప్రకారం జిల్లాలో ఈబీసీ నేస్తం, జగనన్న అమ్మఒడి, జగనన్న చేదోడు, వైఎస్సార్‌ కల్యాణమస్తు, షాదీతోఫా, వైఎస్సార్‌ కాపునేస్తం, వైఎస్సార్‌ మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, వాహనమిత్ర పథకాల ద్వారా 1978 మంది లబ్ధిదారులకు రూ. 2.93 కోట్లు మంజూరు చేశామన్నారు. అనంతరం వివిధ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు నమూనా చెక్కును పంపిణీ చేశారు. అనంతరం డీఆర్డీఏ ఆధ్వర్యంలో జగనన్న పింఛన్‌ కానుక పథకంపై రూపొందించిన పోస్టర్లను కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో మేయర్‌ చిటికిన వెంకటేశ్వరమ్మ, డెప్యూటీ మేయర్‌ మాడపాటి విజయలక్ష్మి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్‌ షేక్‌ దిల్‌షాద్‌ నజరానా, డీఆర్డీఏ పీడీ పీఎస్‌ఆర్‌ ప్రసాద్‌, సాంఘిక సంక్షేమశాఖ డీడీ షేక్‌ షాహెద్‌బాబు, బీసీ కార్పొరేషన్‌ ఈడీ కె. రాజేంద్రబాబు, మత్స్యశాఖ జేడీ ఎన్‌. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

కృష్ణా జిల్లా కలెక్టర్‌ రాజాబాబు

Read latest Krishna News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top