Saturday, April 20, 2024

TS | తెలంగాణాలో వెల్ స్పన్ Welspun World గ్రూప్ పెట్టుబడులు

తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్‌స్పన్ గ్రూప్‌ సంసిద్ధత వ్యక్తం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వెల్‌స్పన్ గ్రూప్‌ ఛైర్మన్ బి. కె. గోయెంకా, సంస్థ ఇతర ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని అనుసరిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. తమ ప్రభుత్వ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని సీఎం వెల్లడించారు.

వెల్‌స్పన్ గ్రూప్‌ చైర్మన్ బి. కె. గోయెంకా మాట్లాడుతూ, తమ కంపెనీ భవిష్యత్తులో చందన్‌వెల్లి పారిశ్రామిక వాడలో ప్రారంభించబడిన IT సేవలలో రూ.250 కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలలో ఐటి రంగాన్ని అభివృద్ధిపరిచేందుకు, వికారాబాద్, అదిలాబాద్ జిల్లాల్లోని యువతకు IT ఉద్యోగాలను కల్పించేందుకు తమ కంపెనీ సిద్ధంగా ఉన్నదని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమారి, ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఐటి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, సిఎం ఓఎస్డీ అజిత్ రెడ్డి, వెల్‌స్పన్ గ్రూప్‌ హెడ్ (కార్పొరేట్ వ్యవహారాలు) చింతన్ థాకర్, భార్గవ మొవ్వ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement