మాలధారణం.. భక్తి తోరణం | Sakshi
Sakshi News home page

మాలధారణం.. భక్తి తోరణం

Published Sat, Jan 6 2024 2:04 AM

గత ఏడాది ఆలయంలో మాలలు వేసుకున్న భక్తులు(ఫైల్‌)  - Sakshi

పెనుగంచిప్రోలు: రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పెనుగంచిప్రోలు తిరుపతమ్మ మండల దీక్ష మాలధారణ కార్యక్రమం శనివారం తెల్లవారుజామున ఆలయంలో ప్రారంభం కానుంది. ఈ దీక్షను ఆలయంలో మొదటి సారిగా 1990లో ఆరంభించారు. ఈ ఏడాది 33వ సంవత్సరం భక్తులు దీక్షను తీసుకోనున్నారు. శబరిమలలో కొలువై ఉన్న అయ్యప్పస్వామి, విజయవాడలో వేంచేసి ఉన్న కనదుర్గమ్మవారి భవానీ మాల అనంతరం మన రాష్ట్రంలో ఎక్కువ మంది తీసుకునేది తిరుపతమ్మవారి మాలేనని పండితులు చెబుతున్నారు. మొదట 46 మందితో దీక్ష ప్రారంభం కాగా, ఏడాదికేడాది పెరుగుతూ ప్రస్తుతం ఏటా 20 నుంచి 25 వేల మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో మాల వేసుకుంటున్నట్లు వివరిస్తున్నారు. మొదట అర్చకులు దివంగత మర్రెబోయిన రామదాసు మాల వేసుకున్నారు. గతంలో పెనుగంచిప్రోలు అమ్మవారి సన్నిధిలోనే స్వాములు మాల వేసుకొని దీక్షలు తీసుకునేవారు. అయితే ఇప్పుడు గురుస్వాములు వారి గ్రామాల్లోనే మాలలు వేస్తున్నారు. అయితే దీక్ష అనంతరం తిరుముడి సమర్పణకు మాత్రం పెనుగంచిప్రోలు అమ్మవారి సన్నిధికి తప్పక వస్తారు. గతంలో మండల దీక్ష మాత్రమే ఉండగా ఈ ఏడాది కొత్తగా అర్ధమండల దీక్ష కూడా ఏర్పాటు చేశారు.

నేటి నుంచి తిరుపతమ్మ మండల దీక్షలు ప్రారంభం

సంఖ్య పెరుగుతూనే ఉంది..

మొదట 46 మందితో ప్రారంభమైన అమ్మవారి మండల దీక్ష మాల ధారణ ప్రస్తుతం 25 వేలకు పైగా పెరిగింది. మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలో వేల సంఖ్యలో అమ్మవారి దీక్షలు తీసుకుంటున్నారు. దీక్ష తీసుకునేవారు ఆలయానికి వచ్చేటప్పుడు ఎర్రని వస్త్రాలు ధరించి, మాలలు, టికెట్టు తీసుకొని రావాలి. స్వాముల దీక్షలు విరమణ ఫిబ్రవరి 23న చేయాల్సి ఉంటుంది.

– మర్రెబోయిన ద్వారకారావు, గురుస్వామి

దీక్షల షెడ్యూల్‌ ఇలా..

ఆలయంలో మాలాధారణ ప్రారంభం:

06.01.2024

మాలధారణ ముగింపు తేదీ: 12.01.2024

అర్ధమండల దీక్ష ప్రారంభం: 28.01.2024

ముగింపు తేదీ: 04.02.2024

1/1

Advertisement
Advertisement