పుస్తకం వైపు

- - Sakshi

యువత చూపు..

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): పుస్తక మహోత్సవంలో వివిధ రకాల సాహిత్యాలు అందుబాటులో ఉన్నా యువత లక్ష్యంగా ప్రచురించిన పుస్తకాలే అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. విజయవాడ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో కొనసాగుతున్న పుస్తక మహోత్సవంలో సుమారు 200 స్టాల్స్‌లో పుస్తకాలు విక్రయాలు జరుగుతుండగా అందులో దాదాపుగా ప్రతి స్టాల్‌లోనూ యువతకు సంబంధించిన పుస్తకాలే అధికంగా అమ్ముడవుతున్నాయి. ప్రచురణకర్తలు సైతం వారే లక్ష్యంగా అధికంగా పుస్తకాలను ముద్రించి మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. దానికి తోడు ప్రస్తుతం విద్యార్థుల అవసరాలు, వారి ఉపాధి అవకాశాలు వీటిని దృష్టిలో పెట్టుకుని వివిధ కోణాల్లో రచయితల చేత కొత్త పుస్తకాలను రాయిస్తున్నారు. యువత పాఠ్యాంశాలకు సంబంధించిన పుస్తకాలకు పెద్దపీట వేస్తున్నారు. వారు అభ్యసించే కోర్సు చివరి సంవత్సరంలో ఉండగా వారిలో ఉన్న నైపుణ్యాలకు పదును పెట్టేందుకు అవసరమైన పుస్తకాల వైపు అధికంగా దృష్టి పెడుతున్నారు. దీంతో వారి అవసరాలను తీర్చే విధంగా రచయితలు, ప్రచురణకర్తలు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు.

సివిల్స్‌లో మెలకువల కోసం...

ప్రతి యువతీ లేదా యువకుడు సివిల్స్‌లో రాణించాలని కలలు కంటుంటారు. ప్రయత్నాలు ఆరంభిస్తారు. వారికోసం ఎన్నో వేల పుస్తకాలను ప్రచురణకర్తలు అందుబాటులో ఉంచుతున్నారు. ముఖ్యంగా దేశంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు తమ అనుభవాలను జోడించి సివిల్స్‌లో రాణించేందుకు అవసరమైన సూచనలు చేస్తూ రచించిన పుస్తకాలు ఇక్కడ లభిస్తున్నాయి. అంతేకాకుండా సివిల్స్‌లో ఎటువంటి శిక్షణ తీసుకోకుండా ఎవరికి వారు వ్యక్తిగతంగా సమాయత్తం చేసేందుకు సీడీలు కూడా ఇటీవల పుస్తక మహోత్సవంలో లభిస్తున్నాయి. అదేవిధంగా సివిల్స్‌కు సంబంధించినంత వరకూ ఎక్కువగా ఆంగ్ల సాహిత్యంలో పుస్తకాలు అధికంగా ఉన్నాయని స్టాల్స్‌ నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే తెలుగులోనూ పుస్తకాలు అధికంగా వస్తున్నాయని వారు వివరిస్తున్నారు.

పుస్తక మహోత్సవంలో యువతే లక్ష్యంగా పుస్తకాలు

వ్యక్తిత్వ వికాసం, పోటీ పరీక్షల పుస్తకాలకు డిమాండ్‌ విద్యార్థులు, యువత నుంచి అనూహ్య స్పందన ఉపాధి అవకాశాల్లో రాణించేందుకు ఆసక్తి

సివిల్స్‌ పుస్తకాలను కొనుగోలు చేశా

పుస్తక మహోత్సవానికి ఏటా వస్తాను. ఈసారి సివిల్స్‌కు సంబంధించిన పుస్తకాలను కొనుగోలు చేశాను. సివిల్స్‌కు హాజరు కావాలని భావించే అభ్యర్థులకు అవసరమైన చాలా పుస్తకాలు పుస్తక మహోత్సవంలో అందుబాటులో ఉన్నాయి. అందరూ సద్వినియోగం చేసుకోవచ్చు.

– ఏ ప్రియ, నున్న

పోటీ పరీక్షల కోసం..

పోటీ పరీక్షల కోసం అవసరమైన పుస్తకాలను కొనుగోలు చేశాను. చాలా రకాల పుస్తకాలు ఆంగ్లంలోనూ, తెలుగులోనూ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఆంగ్లానికి సంబంధించిన పలు ప్రముఖ రచయితల పుస్తకాలు తెలుగులోనూ ఇక్కడ లభిస్తున్నాయి. అంతేకాకుండా ఒక రకమైన సబ్జెక్ట్‌ వివిధ రకాలుగా అందించిన రచయితల పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి.

– బి. అజేంద్ర, విజయవాడ

నాన్‌ ఫిక్షన్‌ పుస్తకాలు చాలా ఉన్నాయి..

నాన్‌ ఫిక్షన్‌ పుస్తకాలంటే నాకు చాలా ఇష్టం. ఏటా వాటిని కొనుగోలు చేస్తాను. ఈ ఏడాది చాలా పుస్తకాలు కనిపించాయి. చాలా మంచి రచయితలు, ప్రముఖ సంస్థల పుస్తకాలు పుస్తక మహోత్సవంలో అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల పుస్తకాలు కొనుగోలు చేయటానికి ఇదొక ప్రత్యేక ప్రాంగణం అందరికీ ఎంతో ఉపయోగంగా ఉంది.

– కె. సాయి విజయవాడ

ఆత్మవిశ్వాసం పెంపొందించే పుస్తకాలు..

విద్యార్థులు చాలా వరకూ తమలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే పుస్తకాలకు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా సమయపాలన, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌, ఇంటర్వ్యూలను ఎదుర్కొవడం ఎలా? పోటీ పరీక్షలకు ఏఏ అంశాలను చదవాలి? అనే విషయాలను పుస్తకాల ద్వారా తెలుసుకునేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఆ దిశగా వారికి కావాల్సిన పుస్తకాలను విరివిగా కొనుగోలు చేన్తున్నారు.

Read latest Krishna News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top