● తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ● విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు

తనిఖీలలో స్వాధీనం చేసుకున్న నగదు  - Sakshi

సరిహద్దు చెక్‌పోస్టు వద్ద రూ. 69 లక్షలు స్వాధీనం

చిల్లకల్లు(జగ్గయ్యపేట): రాష్ట్ర సరిహద్దులోని ఎన్టీఆర్‌ జిల్లా గరికపాడు చెక్‌పోస్టు వద్ద శుక్రవారం పోలీసులు రూ.69.98 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎస్‌ఐ కృష్ణబాబు కథనం ప్రకారం చెక్‌పోస్టు వద్ద విధుల్లో భాగంగా గురువారం రాత్రి 11 గంటల సమయంలో మిర్యాలగూడ నుంచి విజయవాడకు వస్తున్న బస్సును తనిఖీ చేశామని తెలిపారు. ఈ తనిఖీలో ఎటువంటి రశీదులు లేకుండా తీసుకువస్తున్న నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. నగదు తీసుకువస్తున్న వ్యక్తి యార్లగడ్డ మహేశ్వరబాబు తెలంగాణలో ధాన్యం విక్రయించి నగదు తీసుకువస్తున్నామని చెప్పినా రశీదు లేకపోవటంతో నగదు సీజ్‌ చేసినట్టు చెప్పారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

కోడూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందిన ఘటన కోడూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పిట్టల్లంక శివారు బడేవారిపాలెం గ్రామానికి చెందిన అరజా వేణుగోపాల్‌(17) ద్విచక్రవాహనంపై గురువారం రాత్రి అవనిగడ్డకు వెళ్లాడు. రాత్రి 9 గంటల సమయంలో పని ముగించుకొని తిరిగి బడేవారిపాలెంకు బయలుదేరాడు. విశ్వనాథపల్లి సమీపంలో వేణుగోపాల్‌ ద్విచక్ర వాహనం అదుపు తప్పి వేణుగోపాల్‌ బైక్‌ పైనుంచి కింద పడిపోవడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు వేణుగోపాల్‌ను ప్రథమ చికిత్స నిమిత్తం అవనిగడ్డ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి బాధితుడిని మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ప్రయివేటు ఆసుప్రతికి పంపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వేణుగోపాల్‌ శుక్రవారం వేకువజామున మృతిచెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి సోదరుడు రాఘవేంద్రరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు.

పోలీసుల తనిఖీలో రూ.5 లక్షలు స్వాధీనం

కృత్తివెన్ను: జిల్లా సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద గురువారం రాత్రి పోలీసుల తనిఖీలలో భాగంగా ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.5 లక్షల నగదును కృత్తివెన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ గణేష్‌కుమార్‌ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో పల్లెపాలెం వద్ద చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. భీమవరం నుంచి విజయవాడకు వెళుతున్న కారును తనిఖీ చేయగా నగదు లభ్యమైనట్లు ఆయన వివరించారు. దీనికి సంబంధించి వారి వద్ద ఎటువంటి సరైన ఆధారాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్న తహసీల్దార్‌కు అప్పగించనున్నట్లు వివరించారు.

బాలికతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన

కోడూరు: ఉచ్ఛనీచాలు మరిచి ఓ ఉపాధ్యాయుడు నాలుగో తరగతి చదివే బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కోడూరు ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన నరహరిశెట్టి వెంకట సుబ్బారావు ఉల్లిపాలెం ఎంపీయూపీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఈ నెల 2వ తేదీన సుబ్బారావు పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతున్న బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక సరిగ్గా చదవడం లేదనే సాకు చూపి, సుబ్బారావు బాలికను కొట్టడంతో పాటు అసభ్యకరంగా వ్యవహరించాడని బాధితురాలి తల్లి నడకుదిటి ప్రశాంతి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు సుబ్బారావుపై కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.

ఆలస్యంగా వెలుగులోకి...

ఈ నెల 2వ తేదీన సుబ్బారావు బాలిక పట్ల అసభ్యకరంగా వ్యవహరించగా, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుబ్బారావు వ్యవహరించిన తీరుపై శుక్రవారం సోషల్‌ మీడియాతో పాటు పలు సామాజిక మాధ్యమాల్లో వార్త రావడంతో దీనిపై పోలీసులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక విచారణకు ఆదేశించారు. ఎంఈఓలు టి.ఎం.రామదాసు, శ్రీనివాసరావు బాధిత బాలిక కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. కలెక్టర్‌ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టి, నివేదికను ఉన్నతాధికారులకు పంపారు.

Read latest Krishna News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top