ఇష్టానుసారంగా చేస్తామంటే కుదరదు

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న పీడీ సూర్యనారాయణ  - Sakshi

● అప్పగించిన పనులను బాధ్యతతో నిర్వర్తించాలి ● సమీక్ష సమావేశంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పీడీ సూర్యనారాయణ ● టెక్నికల్‌ అసిస్టెంట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌లపై సస్పెన్షన్‌ వేటు

పెడన: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులను ఇష్టానుసారంగా చేస్తామంటే ఊరుకునేది లేదని, అప్పగించిన పనులు సకాలంలో పూర్తి చేయాలని ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పీడీ, హౌసింగ్‌ ఇన్‌చార్జి పీడీ జీవీ సూర్యనారాయణ హెచ్చరించారు. పెడన ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం కృత్తివెన్ను, పెడన, బంటుమిల్లి మండలాలకు చెందిన ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ సిబ్బందితో పాటు సచివాలయాలకు చెందిన ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధి కూలీలకు పనులు కల్పించడంలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో చాలా మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు వెనుకబడుతున్నారన్నారు. హార్టికల్చర్‌ మొక్కల పెంపకం, అమృత్‌ సరోవర్‌, మినీ అమృత్‌ సరోవర్‌లకు సంబంధించి చెరువుల తవ్వకాలు వంటి పనులు చేయడంలో కూడా బాగా నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఏపీఓలు తమ పనితీరు బాగా మెరుగుపరుచుకోవాల్సి ఉందన్నారు. సంక్రాంతి పండుగ తరువాత మండలాల వారీగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కృత్తివెన్ను మండలానికి చెందిన టీఏ ఒకరిని, పెడన మండలానికి చెందిన ఎఫ్‌ఏ ఒకరిని సస్పెండ్‌ చేశారు. అనంతరం హౌసింగ్‌పై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఏవో నాగమల్లేశ్వరరావు, ఏపీడీ రామ్మోహనరావు, హౌసింగ్‌ ఈఈ ఎస్‌.వెంకట్రావు, బంటుమిల్లి, పెడన ఎంపీడీవోలు స్వర్ణమేరి, రెడ్డయ్య, హౌసింగ్‌ డీఈ శ్రీనివాసరావు, సచివాలయాల ఏఈలు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఎఫ్‌ఏలు, టీఏలు పాల్గొన్నారు.

Read latest Krishna News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top