తిరుపతి ప్రయాణికులకు మనవి

- - Sakshi

నంద్యాల(సిటీ): జిల్లా ప్రజలు తిరుపతి వెళ్లేందుకు మరో రైలు అందుబాటులోకి వచ్చింది. నంద్యాల–కడప మధ్య నడిచే 07285/07284 డెమో రైలును రేణిగుంట వరకు పొడిగించారు. శనివారం ఈశాన్య ప్రాంత సాంస్కృతిక, పర్యాటక శాఖాభివృద్ధి మంత్రి కిషన్‌ రెడ్డి నర్సాపురం నుంచి వర్చువల్‌గా ఈ రైలును ప్రారంభించనున్నారు. నంద్యాల నుంచి ఉదయం 5.50 గంటలకు ప్రారంభమయ్యే ఈ రైలు వైఎస్సార్‌, అన్నమయ్య జిల్లాల మీదుగా మధ్యాహ్నం 1.30 గంటలకు రేణిగుంటకు చేరుకుంటుంది. నంద్యాల డెమో పొడిగింపుతో తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించునే భక్తులకు ప్రయాణ కష్టలు తగ్గనున్నాయి.

రైలు వేళలు ఇలా..

నంద్యాలలో 07285 రైలు ఉదయం 5.50 గంటలకు బయలుదేరి కడపకు 9.40కి చేరుకుంటుంది. అక్కడి నుంచి 9.45కు బయలు దేరి రేణిగుంటకు మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకుంటుంది. తిరిగి 07284 రేణిగుంటలో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి కడపకు 5.30, నంద్యాలకు రాత్రి 9.30 గంటలకు చేరుకుంటుంది. నంద్యాల – రేణిగుంట స్టేషన్ల మధ్య మద్దూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల, సంజామల, నొస్సం, సుప్పలపాడు, జమ్ములమడుగు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, ఓబులవారిపల్లె, రైల్వేకోడూరు, బాలపల్లె స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది.

ప్రయాణికులు సద్వినియోగం

చేసుకోవాలి

డెమో రైలు పొడిగింపుతో నంద్యాల నుంచి కడప, రేణిగుంట, తిరుపతికి వెళ్లే ప్రయాణికులు, యాత్రికులు, విద్యార్థులు, అధికారులకు ఎంతో అనుకూలంగా మారింది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే శాఖ చర్యలు తీసుకుంటోంది. గుంటూరు – నంద్యాల డివిజన్ల పరిధిలోని రైల్వే డబ్లింగ్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే మరింత వేగంగా, సజావుగా ప్రయాణం కొనసాగనుంది.

– ఎన్‌.దొరస్వామి, స్టేషన్‌మాస్టర్‌, నంద్యాల

నంద్యాల డెమో రేణిగుంట వరకు

పొడిగింపు

నేటి నుంచి ప్రారంభం

Read latest Kurnool News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top