హత్య కేసులో నిందితుల అరెస్టు

నిందితుల అరెస్టు చూపిస్తున్న 
డీఎస్పీ శ్రీనివాసరెడ్డి  
 - Sakshi

డోన్‌ రూరల్‌: ఉంగరానిగుండ్ల గ్రామంలో డిసెంబర్‌ 31వ తేదీన అర్ధరాత్రి జరిగిన ఓ యువకుడి హత్య కేసులో 13 మంది నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం డీఎస్పీ శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వివరించారు. డోన్‌కు చెందిన ఎరుకలి లక్ష్మీనారాయణ ఏడేళ్ల క్రితం ఉంగరానిగుండ్ల గ్రామంలో ఓ పాత ఇంటిని కొనుగోలు చేసిన తర్వాత మరమ్మతులు చేసి కుటుంబంతో అక్కడే ఉంటున్నాడు. గ్రామంలో కేవలం ఒకే ఒక్క ఎస్టీ కులానికి చెందిన ఇల్లు ఉండటాన్ని ఇష్టం లేని నిందితులు తరచూ లక్ష్మీనారాయణతో ఘర్షణ పడుతూ గ్రామం నుంచి వెళ్లేగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఉంగరానిగుండ్ల గ్రామానికి చెందిన చిన్నమద్ది కుమారులు ఓబులేసు, నవీన్‌ తనను కులం పేరుతో దూషించారని లక్ష్మీనారాయణ అల్లుడు సీతారాము డిసెంబర్‌ 12వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు కాగా అప్పటి నుంచి వారి మధ్య మనస్పర్థలు త్రీవ స్థాయికి చేరుకున్నాయి. దీంతో డిసెంబర్‌ 31వ తేదీ అర్ధరాత్రి లక్ష్మీ నారాయణ ఇంటిపై చిన్నమద్ది, అతని ఇద్దరు కుమారులు ఓబులేసు, నవీన్‌, తలారి సిసింద్రి, మధు, చిన్న మద్దయ్యతో పాటు మరో ఎనిమిది మంది దాడి చేశారు. ఈ దాడిలో లక్ష్మీనారాయణ కుమారుడు ఖాదర్‌ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ మేరకు 14 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేస్తుండగా శుక్రవారం టిట్కో గృహాల వద్ద 13 మందిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు రామ్మోహన్‌ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రూరల్‌ ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి, టౌన్‌ ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Kurnool News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top