శ్రీమఠం పీఠాధిపతికి ‘అయోధ్య’ ఆహ్వానం

- - Sakshi

ఆదోనిఅర్బన్‌: అయోధ్యలో ఈనెల 22వ తేదీన జరిగే శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపనకు రావాలని కోరుతూ మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులుకు ఆదోని పట్టణానికి చెందిన శ్రీరామక్షేత్ర ట్రస్ట్‌ నిర్వాహకులు, విశ్వహిందూ పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు బసవన్నగౌడ్‌ ఆహ్వాన పత్రికను అందజేశారు. శుక్రవారం నేరుగా మంత్రాలయం మఠానికి వెళ్లి పీఠాధిపతికి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను, ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా బసవన్నగౌడ్‌ మాట్లాడుతూ.. అయోధ్యలో జరిగే కార్యక్రమానికి ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలువురికి ఆహ్వానం వచ్చిందని, అందులో మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి ఉన్నారని తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రాంత కార్యాలయ సంయుక్త కార్యదర్శి ప్రాణేష్‌, కోశాధికారి మహేష్‌, ట్రెజరర్‌ జి.సుబ్రమ్మణ్యం పాల్గొన్నారు.

డిగ్రీ పరీక్షల్లో

18 మంది డిబార్‌

కర్నూలు(సెంట్రల్‌): రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న సెమిస్టర్‌ పరీక్షల్లో శుక్రవారం 18 మంది డిబార్‌ అయ్యారు. 5వ సెమిస్టర్‌ పరీక్షకు 7,258 మందికిగాను 6538 మంది, మొదటి సెమిస్టర్‌కు 11563 మందికిగాను 10417 మంది హాజరైనట్లు ఆర్‌యూ అధికారులు తెలిపారు.

సీడ్‌ ఫామ్‌ల అభివృద్ధిపై దృష్టి

రూ.35 లక్షలతో గోదాము,

సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్మాణాలు

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వ్యవసాయ క్షేత్రాలను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. కర్నూలు మండలంలోని ఎదురూరు ఫామ్‌, ఎమ్మిగనూరు మండలంలోని ముగతి పీడీ డి.ఫామ్‌, నంద్యాల జిల్లాలో తంగడెంచ ఫామ్‌లు ఉన్నాయి. ప్రతి ఫామ్‌లో రూ.35 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. 200 టన్నుల సామర్థ్యం కలిగిన గోదాము, సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌, సీడ్‌ ప్రాసెసింగ్‌కు అవసరమైన ఎక్వీప్‌మెంటు, పంట నూర్పిడి కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.35 లక్షల వ్యయంతో వీటిని సిద్ధం చేసేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు రెండు రోజుల్లో ప్రతిపాదనలు పంపాలని వ్యవసాయ శాఖ కమిషనర్‌ హరికిరణ్‌ కర్నూలు, నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

ఊపందుకున్న

పింఛన్ల పంపిణీ

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ ఊపందుకుంది. కౌతాళం, కర్నూలు రూరల్‌, దేవనకొండ, మద్దికెర మండలాలు మినహా మిగిలిన అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో పింఛన్ల పంపిణీ మొదలైంది. ఈ మండలాల్లో శనివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సంబంధిత శాసనసభ్యులు ప్రారంభిస్తారు. శుక్రవారం నందవరం, సి.బెళగల్‌, పెద్దకడుబూరు, ఆస్పరి మండలాల్లో వైఎసార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ కార్యక్రమాన్ని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చేపట్టారు. కర్నూలు జిల్లాలో మొత్తం 2,48,072 పింఛన్లు ఉండగా.. ఈ నెల 5వ తేదీ సాయంత్రం 6 గంటల సమయానికి 98,542 మందికి పింఛన్లు పంపిణీ చేశారు. పంపిణీ గడవును పొడిగించే అవకాశం ఉంది.

● నంద్యాల జిల్లాలో పంపిణీ 50.84 శాతం పూర్తయింది. జిల్లాలో 2,24,228 పింఛన్లు ఉండగా.. 1,13,996 పింఛన్లు పంపిణీ చేశారు.

నేడు, రేపు పోలీసు క్రీడలు

కర్నూలు: కర్నూలులోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఈనెల 6, 7 తేదీల్లో పోలీసు క్రీడాపోటీలు జరగనున్నాయి. గేమ్స్‌, ట్రాక్స్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్లకు సంబంధించిన పోటీలు నిర్వహించనున్నారు. జిల్లాలోని పోలీసు సబ్‌ డివిజన్‌ వారీగా ఏర్పాటు చేసే టీములు పోటీల్లో పాల్గొంటాయని జిల్లా పోలీసు కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్లలో 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 1500 మీటర్లు, లాంగ్‌జంప్‌, జావెలిన్‌ త్రో, షార్ట్‌పుట్‌, ఆటలకు సంబంధించి కబడ్డీ, వాలీబాల్‌, షటిల్‌ ఫర్‌ ఆఫీసర్స్‌ పోటీలు జరుగుతాయి. పోటీల్లో పాల్గొనేవారికి వసతి కల్పిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఏఆర్‌ డీఎస్పీ ఇలియాస్‌ 9121101066, రెండో పట్టణ సీఐ 9121101059 నంబర్లకు ఫోన్‌ చేసి సంప్రదించాలని కోరారు.

Read latest Kurnool News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top