త్వరితగతిన పరిష్కరించాలి

కాళ్ల: ఓటరు నమోదు, తొలగింపు, జాబితాల్లో మార్పులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు. బొండాడలో శుక్రవారం ఆమె పర్యటించి ఫొటోస్‌ సిమిలర్‌ ఎంట్రీస్‌, డెమోగ్రాఫికల్‌ సిమిలర్‌ ఎంట్రీస్‌ తొలగింపుల ప్రక్రియను శనివారం ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతనెల 9 నుంచి అందిన దరఖాస్తులు, అభ్యంతరాలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఓటరు నమోదు అధికారులు నియోజకవర్గం, మండల కేంద్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలన్నారు. పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి మౌలిక వసతులపై నివేదిక సమర్పించాలన్నారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై పోలింగ్‌ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. తహసీల్దార్‌ టీఏ కృష్ణారావు, ఆర్‌ఐ, బీఎల్‌ఓలు, వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

జాతీయ పోటీలకు ఎంపిక

ఏలూరు రూరల్‌: ఏలూరు కస్తూరిబా బాలికల పాఠశాల క్రీడాకారిణి పి.నందిని జాతీయ బాస్కెట్‌బాల్‌ పోటీలకు ఎంపికయ్యిందని హెచ్‌ఎం జి.సునీత ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 8 నుంచి 12 వరకు రాజస్థాన్‌లో జరిగే జాతీయస్థాయి ఎస్‌జీఎఫ్‌ఐ అండర్‌–14 బాస్కెట్‌బాల్‌ పోటీల్లో ఆమె పాల్గొంటుందన్నారు. గత నవంబరులో చిత్తూరు జిల్లాలో జరిగిన అంతర జిల్లాల బాస్కెట్‌బాల్‌ పోటీల్లో నందిని ప్రతిభ చాటి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యిందన్నారు. 8వ తరగతి చదువుతున్న నందిని మూడుసార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకుందన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు కె.మురళీకృష్ణ, ఎంవీఎల్‌ ప్రసన్న ఆమెను అభినందిచారు.

సంక్రాంతికి ప్రత్యేక బస్సులు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌ నుంచి సొంత గ్రామాలకు వచ్చే వారి కోసం ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల నుంచి ఈనెల 10 నుంచి 13 వరకు 90 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు ఏలూరు జిల్లా ప్రజారవాణా అధికారి ఎన్‌వీఆర్‌ వరప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రారంభమైందని, అలాగే ఈనెల 16 నుంచి 21 వరకు ఆయా డిపోల నుంచి ఇప్పటివరకు దాదాపు 50 సర్వీసులకి రిజర్వేషన్‌ సౌ కర్యం ప్రారంభించామని పేర్కొన్నారు. తిరుపతి, విశాఖతో పాటు విజయవాడకు ప్రత్యేక బస్సులు నడుపుతామని తెలిపారు. సంక్రాంతి కానుకగా సాధారణ చార్జీలకే ప్రయాణికులకు టికెట్లు విక్రయిస్తున్నామని, రానుపోనూ టికెట్లు బుక్‌ చేసుకుంటే పది శాతం రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు.

మహిళాభ్యున్నతి ప్రభుత్వ లక్ష్యం

నూజివీడు: మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సీఎం జగన్‌ తోడ్పాటు అందిస్తున్నారని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు అన్నారు. పట్టణంలో డ్వాక్రా మహిళలు రూ.36 లక్షలతో ఏర్పాటు చేసిన నూజివీడు చేయూత మహిళా మార్ట్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ మహిళా మార్ట్‌లో నా ణ్యమైన సరుకులను తక్కువ ధరకు విక్రయిస్తున్నందున మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో మహిళాభివృద్ధికి పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో మహిళలంతా సీఎం జగన్‌కు అండగా ఉండాలని కోరారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలన్నదే సీఎం జగన్‌ ధ్యేయమన్నారు. సెర్ప్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ మహిత మాట్లాడుతూ రాష్ట్రంలో 45 మహిళా మార్ట్‌లను ఏర్పాటు చేశామని, నూజివీడు మార్ట్‌ 46వదని అన్నారు. మొత్తంగా రూ.70 కోట్ల వ్యాపారం నిర్వహించామన్నారు.

Read latest West Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top