వైద్యసేవల క్యాలెండర్‌ ఆవిష్కరించిన మంత్రి రజిని

- - Sakshi

గుంటూరు మెడికల్‌ : పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య ఆరోగ్య శాఖ అందుబాటులోకి తెచ్చిన మౌలిక సదుపాయాలు, అధునాతన వైద్య సేవల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. అర్బన్‌ పీహెచ్‌సీల్లోని వైద్య సేవలన్నింటిని పొందుపరుస్తూ 2024 సంవత్సరం టేబుల్‌ క్యాలెండర్‌ను రూపొందించడం అభినందనీయమన్నారు. శుక్రవారం గుంటూరు ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో హెల్త్‌ క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నేషనల్‌ అర్బన్‌ హెల్త్‌ మిషన్‌ స్టేట్‌ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జవ్వాది విజయలక్ష్మి, గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ కీర్తి చేకూరి పాల్గొన్నారు.

టెన్త్‌లో నూరు శాతం ఉత్తీర్ణతకు చర్యలు

శావల్యాపురం: 2023–24 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫైనల్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంపుదలకు భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించినట్లు పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.శామ్యూల్‌ అన్నారు. శుక్రవారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలను డీఈవో సందర్శించారు. డీఈవో మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో 24 వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా 179 జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో 15 వేల మంది విద్యార్థుఽలకు జగనన్న విద్యా జ్యోతి స్టడీ మెటీరియల్‌ అందజేశామన్నారు. సమ్మెటీవ్‌ పరీక్షల మార్కుల ఆధారంగా విద్యార్థులను గ్రేడులుగా విభజించి ప్రత్యేక తరగతులు ఉదయం, సాయంత్రం నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు. జెడ్పీ ఉన్నత పాఠశాలలో బాలికల జూనియర్‌ కళాశాల ప్రారంభమైందని, నూరు శాతం ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయులకు సూచనలు చేశామన్నారు. విధుల్లో అలసత్వం వహించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయనతో పాటు హెచ్‌ఎం బి.విజయలక్ష్మి,బెజవాడ చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

మిర్చి యార్డు అభివృద్ధికి రూ.9 కోట్లు

యార్డు చైర్మన్‌ నిమ్మకాయల

రాజనారాయణ

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్‌ యార్డు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.9 కోట్ల మంజూరు చేసిందని యార్డు చైర్మన్‌ నిమ్మకాయల రాజనారాయణ తెలిపారు. నిధుల వినియోగంపై యార్డు అధికారులు, మార్కెటింగ్‌ శాఖ ఇంజినీరింగ్‌ అధికారులతో శుక్రవారం సాయంత్రం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. చైర్మన్‌ మాట్లాడుతూ రూ.60 లక్షలతో నూతన మరుగు దొడ్ల నిర్మాణం, రూ.95 లక్షలతో కాంప్లెక్స్‌ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. రూ.2 కోట్లతో కృష్ణ నగర్‌ రైతు బజారు నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. మిగిలిన నిధులను రైతులకు ఉచిత అల్పాహారం, భోజనం, వసతి, మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌లకు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. పనులకు తగిన రీతిలో ప్రణాళిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కోరారు. సమావేశంలో మార్కెటింగ్‌ శాఖ చీఫ్‌ ఇంజినీరు శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు శేషగిరిరావు, మార్కెటింగ్‌శాఖ విజిలెన్స్‌ జేడీ రాజశేఖర్‌, మార్కెటింగ్‌ శాఖ సంయుక్త సంచాలకులు, మిర్చి యార్డు ఇన్‌చార్జి కార్యదర్శి కాకుమాను శ్రీనివాసరావు, యార్డు అదనపు కార్యదర్శులు శివారెడ్డి, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

చోరీ కేసులో

ఒకరికి రెండేళ్ల జైలు

నగరంపాలెం: గతేడాది తెనాలి పరిధిలో జరిగిన ఓ చోరీ/ దోపిడీ కేసులో నిందితునికి రెండేళ్ల కఠిన కారాగార జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధిస్తూ తెనాలి ఒకటో ఏజేసీజే కోర్టు జడ్జి తీర్పు వెలువరించారు. గుంటూరు జిల్లా ఎస్పీ కె.ఆరిఫ్‌హఫీజ్‌ శుక్రవారం అందించిన వివరాలు.. గతేడాది తెనాలి ఒన్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌(పీఎస్‌) పరిధిలోని ఓ ప్రాంతంలో చోరీ/ దోపిడీ జరగ్గా, కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో తెనాలి రజక చెరువు అమ్మ ఆస్పత్రి సమీపంలో ఉంటున్న కోలా రత్నరాజుని స్టేషన్‌ సీఐ చంద్రశేఖర్‌ అరెస్ట్‌ చేశారు. అనంతరం రిమాండ్‌కు పంపించగా, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. ఈ క్రమంలో సాక్ష్యులను కోర్టులో హాజరుపర్చగా, అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పి.సునీల్‌కుమార్‌ ప్రాసిక్యూషన్‌ తరఫున వాదనలు వినిపించారు. ఈ కేసులో గుడ్‌ ట్రయల్‌ మానిటరింగ్‌ ద్వారా సమర్థంగా విచారణ నిర్వహించారు. దీంతో సాక్ష్యాధారాలతో అతనిపై నేరం రుజువుకావడంతో శుక్రవారం తెనాలి ఒకటో ఏజేసీజే కోర్టు జడ్జి తీర్పు చెప్పారు. జిల్లా ఎస్పీ ఆరిఫ్‌హఫీజ్‌ మాట్లాడుతూ నేరాలకు పాల్పడే వారికి శిక్ష పడేలా, గుడ్‌ ట్రయల్‌ మానిటరింగ్‌, పోలీస్‌ శాఖ కృషి చేస్తుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం నుంచి తప్పించుకోలేరని చెప్పారు. నిందితునికి శిక్షపడటంలో కీలకంగా వ్యవహరించిన సీఐ చంద్రశేఖర్‌, ఏపీపీ పి.సునీల్‌కుమార్‌, కోర్టు లైజన్‌ ఎస్‌ఐ శివప్రసాద్‌, తెనాలి ఒన్‌ టౌన్‌ కోర్టు కానిస్టేబుల్‌ను జిల్లా ఎస్పీ అభినందించారు.

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top