శాంతి.. స్వర్ణ కాంతి

వీసీ రంగజనార్దన చేతుల మీదుగా 8 బంగారు పతకాలు  అందుకున్న దాసరి శాంతి - Sakshi

అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థిని దాసరి శాంతి ఏకంగా ఎనిమిది బంగారు పతకాలు దక్కించుకున్నారు. బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ టాపర్స్‌ ఆఫ్‌ జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్‌ కళాశాల, 1982 ఎండోమెంట్‌ బంగారుపతకం , చల్లా సుబ్బరాయుడు స్మారక బంగారు పతకాలు ( రెండు), కే.వెంకటేశ్వర రావు స్మారక బంగారు పతకం, ప్రొఫెసర్‌ టీఎస్‌ రాఘవన్‌ స్మారక బంగారు పతకం, చుండుపల్లి వెంకటరాయలు, సరోజమ్మ స్మారక బంగారు పతకం, ప్రొఫెసర్‌ బి.విజయ భాస్కర్‌ దేశాయ్‌ దంపతుల బంగారుపతకం ...ఇలా మొత్తం 8 పతకాలు సాధించారు. దాసరి శాంతి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చెందిన వారు. జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్‌ కళాశాలలో 2022–23 విద్యా సంవత్సరంలో సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. 90.14 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి కళాశాల టాపర్‌గా నిలిచారు. అమ్మ సావిత్రి. నాన్న నరసప్ప. నాన్న ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నారు. మొత్తం ముగ్గురు కుమార్తెల్లో శాంతి చిన్నవారు. ఒక అక్క టీసీఎస్‌లో, మరొకరు కాగ్నిజెంట్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ సాధించడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నట్లు శాంతి తెలిపారు. ఏకంగా 8 బంగారు పతకాలు దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రణాళికాబద్ధంగా చదవడం, ప్రొఫెసర్ల సహకారం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు.

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top